ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4 అనగానే మనకు ఒక చేదు నిజం గుర్తుకొస్తుంది. “క్యాన్సర్” అనే మాట వినగానే చాలా మందిలో మొదటగా పుట్టేది భయం. ఇక నా జీవితం ముగిసిపోయిందా? అనే ఆలోచన మనసును చుట్టుముడుతుంది. డాక్టర్లు “క్యాన్సర్” అని చెప్పిన క్షణమే, ఎంతోమంది జీవితం మీద ఆశను కోల్పోయి, తమ కలలను, భవిష్యత్తును అంధకారంలో చూసుకుంటారు. కానీ నిజంగా క్యాన్సర్ అంటే అంతమేనా? కాదు. క్యాన్సర్ ఒక వ్యాధి మాత్రమే—జీవితానికి అంతం కాదు.
ఒకప్పుడు క్యాన్సర్‌ను చాలా ప్రాణాంతకమైన వ్యాధిగా భావించేవారు. అవగాహన లేకపోవడం, భయం వల్ల పరీక్షలకు వెళ్లకపోవడం, లక్షణాలను చిన్నవిగా తీసుకోవడం—ఈ నిర్లక్ష్యమే అనేక ప్రాణాలను బలి తీసుకుంది. ప్రారంభ దశలో గుర్తించవచ్చిన క్యాన్సర్‌ను పట్టించుకోకపోవడం వల్ల, చివరి దశలో మాత్రమే ఆసుపత్రులకు వెళ్లి, బ్రతికే అవకాశం లేక ఎంతోమంది మరణించారు. ఇది క్యాన్సర్ బలం కాదు—మన మౌనం, మన నిర్లక్ష్యం.
క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
క్యాన్సర్ అనేది ఒక్క కారణంతో వచ్చే వ్యాధి కాదు. మన శరీరంలోని కణాలు నియంత్రణ తప్పి పెరిగినప్పుడు క్యాన్సర్ ఏర్పడుతుంది.
శరీరంలో కణాలు ఎందుకు నియంత్రణ తప్పుతాయి?
సిగరెట్లు, గుట్కా, ఖైనీ, పొగాకు వంటి మత్తు పదార్థాలను ఎక్కువగా వినియోగించడం వల్ల నోరు, గొంతు, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అదే విధంగా జంక్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కణాల నియంత్రణ తప్పి అసాధారణంగా పెరిగి, ఏదో ఒక భాగంలో క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్య కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. అలాగే మద్యం సేవించడం కూడా క్యాన్సర్‌కు ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలు, గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం క్యాన్సర్ నివారణలో అత్యంత ముఖ్యమైనది.
క్యాన్సర్ లక్షణాలు
గొంతులో వచ్చే క్యాన్సర్ ఎలా ఉంటుందంటే మింగేటప్పుడు మింగలేకపోవడం, మింగేటప్పుడు నొప్పి రావడం, గొంతులో గడ్డలా అనిపించడం, నోటిలో పుండ్లు లేదా గడ్డలు మానకపోవడం, అలాగే నోరు పూర్తిగా తెరవటానికి ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అలాగే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు ఎక్కువ రోజులు దగ్గు రావడం, శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది పడటం, చాతిలో నొప్పి కలగడం లాంటి లక్షణాలు ఉంటాయి.
స్త్రీలలో బ్రెస్ట్ (చాతి) క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే చాతిలో గడ్డలుగా కనిపించడం, చాతి ఆకారం లేదా నిప్పిల్ మారిపోవడం, నొప్పి లేదా వాపు రావడం జరుగుతుంది.
ఇవన్నీ 2–3 వారాలకంటే ఎక్కువ రోజులు అలాగే కొనసాగితే, ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని చూపించడం చాలా అవసరం. చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయడం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.
క్యాన్సర్ ను ఎలా జయించాలి?

క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే ముందుగానే గుర్తించి డాక్టర్ని సంప్రదించడం మనం చేయగలిగిన అత్యంత ఉత్తమమైన పని. ఇలా సమయానికి చికిత్స తీసుకుంటే మన జీవితాన్ని మనమే కాపాడుకోగలం. క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. నేటి కాలంలో వైద్య రంగం, టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. క్యాన్సర్‌కు అవసరమైన పరీక్షలు, ఆధునిక పరికరాలు, ప్రభావవంతమైన మందులు సకాలంలో అందుబాటులో ఉన్నాయి.
ఎవరికి క్యాన్సర్ వచ్చినా ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఒకటే—భయం కాదు, ధైర్యం కావాలి. మానసికంగా బలంగా ఉంటేనే జీవితం మీద ఆశ గెలుస్తుంది. మనసు కుంగిపోతే వ్యాధి బలపడుతుంది; ధైర్యంగా ఉంటే వ్యాధి బలహీనపడుతుంది. ఈ రోజుల్లో క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, మామూలు జీవితంలాగే జీవించవచ్చు.
మనం తప్పనిసరిగా చేయాల్సింది—చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం. సిగరెట్లు, పొగాకు, మద్యం వంటి అలవాట్లు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. అలాగే అధిక ఒత్తిడి కూడా ప్రమాదకరం. ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి జీవనశైలి, ఒత్తిడి, నిర్లక్ష్యం ప్రధాన కారణాలు.

