చాలామంది చిన్నపిల్లలు దగ్గు, జలుబు వంటి సమస్యలతో తరచూ బాధపడుతుంటారు. చిన్నపిల్లలకు వారానికి ఒక్కసారైనా దగ్గు లేదా జలుబు వస్తూ ఉంటుంది. ఇంకొందరు పిల్లలు అయితే నెలలో రెండుసార్లు అయినా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది చాలా ఇబ్బందిగా మారుతుంది.
దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లే పిల్లలకు ఇలా తరచూ దగ్గు, జలుబు రావడానికి కారణమవుతున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు, తెలియకపోవడం వల్ల అదే సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది.

పిల్లల్లో తరచూ వచ్చే జలుబు, దగ్గు అసలు కారణాలు
చాలామంది తల్లిదండ్రులు రోజూ ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనది పిల్లల్లో తరచూ వచ్చే జలుబు, దగ్గు. ముఖ్యంగా చంటి పిల్లలు, ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సారి జలుబు దగ్గు రాగానే మందులు వాడటం, ఆయిల్స్ రాయటం, ఆవిరి ఇవ్వటం లాంటి తప్పులు చేయడం వల్ల సమస్య తగ్గకుండా ఇంకా పెరుగుతుంది.
బాటిల్ ఫీడింగ్ వల్ల వచ్చే సమస్యలు

చంటి పిల్లల్లో జలుబు, దగ్గు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి బాటిల్‌తో పాలు ఇవ్వడం,ముఖ్యంగా పిల్లలను పూర్తిగా పడుకోబెట్టి లేదా నిద్రలోనే బాటిల్ పెట్టడం చాలా ప్రమాదకరం, ఇలా చేస్తే పాలు శ్వాసనాళంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది, దాంతో దగ్గు, జలుబు, ఛాతీ ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి.
అవసరమైతే పిల్లలను కొంచెం నిటారుగా పెట్టి మాత్రమే బాటిల్ ఇవ్వాలి, కుదిరినంత వరకు ఒక సంవత్సరం నిండేలోపు బాటిల్ అలవాటు మానిపించడానికి ప్రయత్నించాలి.
ఇంట్లో ఎక్కువ వాసనలు ఉండటం

ఇళ్లలో తరచూ వాడే అగరబత్తీలు, కర్పూరం, యూకలిప్టస్ ఆయిల్, దోమల మందులు, రూమ్ ఫ్రెషనర్లు, సెంటల్ స్ప్రేలు, పౌడర్లు వంటి వాటి వాసనలు పిల్లల శ్వాసనాళాన్ని రెచ్చగొడతాయి, ఈ వాసనల వల్ల దగ్గు, జలుబు, అలర్జీలు పెరుగుతాయి. పిల్లలున్న ఇళ్లలో ఇవన్నీ అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి.
కర్పూరం, యూకలిప్టస్, బేబీ విక్స్ వాడకం
చాలామంది జలుబు అనగానే పిల్లలకు కర్పూరం, యూకలిప్టస్ ఆయిల్, బేబీ విక్స్ లాంటివి రాస్తారు,కొందరు ఇంకా ప్రమాదకరంగా జిండా తిలిస్మాత్ లాంటి ద్రావణాలు తాగిస్తారు. ఇవి జలుబును తగ్గించవు. కేవలం ముక్కు కారేలా చేసి తాత్కాలికంగా ఉపశమనమిచ్చినట్టు అనిపిస్తుంది. కానీ నిరంతరం వాడితే ఆస్తమా, దీర్ఘకాల దగ్గు పెరుగుతుంది.
పొరపాటున తాగితే ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. పెద్దవాళ్లకు సరిపోయే వాటిని పిల్లలకు వాడకూడదు.
పిల్లలకు నేరుగా ఆవిరి ఇవ్వడం

పిల్లలకు నేరుగా స్టీమ్ ఇవ్వడం చాలా ప్రమాదకరం. వేడి ఆవిరి వల్ల చేతులు, ముఖం కాలిపోవచ్చు. ఆసుపత్రులకు వచ్చే చాలా ప్రమాదాలు దీనివల్లే జరుగుతున్నాయి. ఆవిరి ప్రభావం కావాలంటే వెచ్చని గుడ్డతో ఛాతీ తుడవడం సరిపోతుంది,లేకపోతే బాత్రూంలో కొద్దిగా ఆవిరి నింపి పిల్లను కొంతసేపు కూర్చోబెట్టవచ్చు. నేరుగా స్టీమ్ పిల్లలకు ఇవ్వకూడదు.
ఇంటి పరిశుభ్రత & గాలి నాణ్యత
సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్యాన్లు, ఏసీలు కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి, వాటిలో పేరుకున్న దుమ్ము పిల్లలకు శ్వాస సమస్యలు కలిగిస్తుంది,ఫ్యాన్ గాలి మరీ ఎక్కువగా కాకుండా వీలైనంతవరకు కాస్త తగ్గించి పెట్టుకోవడమే మంచిది నేరుగా మొహానికి తగలకుండా ఉంటే ఇంకా మంచిది.
దుమ్ము, డస్ట్ మైట్స్ & బొమ్మలు
డస్ట్ మైట్స్ అనేవి కంటికి కనిపించవు కానీ దుప్పట్లు, దిండు కవర్లు, సోఫాలు, బెడ్లలో ఎక్కువగా ఉంటాయి, ఇవి పిల్లల్లో అలర్జీ, దగ్గు, జలుబుకు కారణమవుతాయి.
దుప్పట్లు, కవర్లు 60 డిగ్రీల కంటే ఎక్కువ వేడి నీటిలో ఉతకాలి. టెడ్డీ బేర్ లాంటి బొమ్మలు ఎక్కువగా ఉంచకూడదు. వారానికి ఒకసారి వాక్యూమ్ లేదా బాగా శుభ్రం చేయాలి.
జలుబు దగ్గుకు మందులు ఎప్పుడు అవసరం?
చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు సాధారణంగా ఐదు రోజుల్లో తానే తగ్గిపోతుంది. మొదటి రోజే దగ్గు మందులు ఇవ్వడం ప్రమాదకరం. తప్పు డోసులు ఇచ్చితే మత్తు రావడం, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన జ్వరం, ఐదు రోజులకు మించి తగ్గని లక్షణాలు ఉంటే మాత్రమే డాక్టర్‌ను సంప్రదించాలి. ముక్కులో బ్లాక్ ఉంటే సెలైన్ నోస్ డ్రాప్స్ రెండు చుక్కలు వేయవచ్చు.
సహజంగా ఇమ్యూనిటీ పెంచే మార్గాలు
ఇమ్యూనో బూస్టర్లు, గమ్మీస్, మిల్క్ మిక్స్లు పిల్లలకు అవసరం లేదు. బయట ఆడుకోవడం, శుభ్రమైన ఇల్లు, సూర్యరశ్మి, మంచి ఆహారం, సరైన నిద్ర ఇవే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సాధారణంగా ఐదు ఏళ్లు దాటాక పిల్లల ఇమ్యూనిటీ ఆటోమేటిక్‌గా మెరుగవుతుంది. అందుకే తల్లిదండ్రులు కొంచెం ఓపికగా ఉండాలి.
ఎప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి?
పిల్లలు నోరు తెరిచి శ్వాస తీసుకోవడం, నిద్రలో గురకలు పెట్టడం, తరచూ తీవ్రమైన జలుబు రావడం, గ్రోత్ సరిగా లేకపోవడం లాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా డాక్టర్‌ను చూపించాలి. ఇవి లేకుండా అప్పుడప్పుడు జలుబు వచ్చి తగ్గితే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు.
ముగింపు
పిల్లల్లో జలుబు, దగ్గు ఎక్కువగా మందుల వల్ల కాకుండా మన జీవనశైలి, ఇంటి వాతావరణం వల్ల వస్తాయి.
ఈ పేజీలో ఇచ్చిన ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది డాక్టర్ సూచనలకు లేదా వైద్య చికిత్సలకు ప్రత్యామ్నాయం కాదు.
ఏదైనా ఆరోగ్య సమస్య, లక్షణాలు లేదా మందుల విషయంలో తప్పకుండా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.