షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు (ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి)

ఎక్కువ షుగర్ అంటే తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల, సాధారణ వ్యక్తుల్లోనే  రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇప్పటికే డయాబెటిస్ (మధుమేహం) ఉన్న వ్యక్తులు షుగర్ లేదా తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే, వారి శరీరంపై ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది.

డయాబెటిస్ పేషెంట్లు తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి ప్రమాదకరంగా పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో నెమ్మదిగా అనేక మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా కళ్లలోని నరాలు దెబ్బతిని కంటి చూపు మందగించడం, మసకగా కనిపించడం వంటి సమస్యలు మొదలవుతాయి. దీర్ఘకాలంలో ఇది చూపు కోల్పోయే పరిస్థితికి కూడా దారితీస్తుంది.

అదేవిధంగా శరీరంలోని నరాలపై ప్రభావం పడుతుంది. చేతులు, కాళ్లలో మంటలు, చీమలు కుట్టినట్టు అనిపించడం, మొద్దుబారడం వంటి నరాల సమస్యలు (న్యూరోపతి) ఏర్పడతాయి. నెమ్మదిగా కిడ్నీల పనితీరు కూడా తగ్గిపోతుంది, దీని వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అంతేకాకుండా, రక్తపోటు (బీపీ) పెరగడం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా అధికమవుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు షుగర్, స్వీట్స్, తీపి పానీయాలు పూర్తిగా మానేసి, డాక్టర్ సూచించిన ఆహారం మరియు జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా వాటిని పూర్తిగా నివారించడం చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు స్వీట్స్, షుగర్ కలిపిన పానీయాలు, బేకరీ పదార్థాలను దూరంగా ఉంచాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ప్రతిరోజూ తగినంతగా గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండడం శరీరానికి ఎంతో మంచిది. అలాగే రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక చేయాలి. నడక వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఇన్సులిన్ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది మరియు షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా, ఎలాంటి విరామం లేకుండా వాడడం చాలా అవసరం. మందులను స్వయంగా ఆపడం లేదా మార్చడం మంచిది కాదు. అదేవిధంగా నెలకు ఒకసారి అయినా తప్పకుండా డాక్టర్ దగ్గర చెక్‌అప్ చేయించుకుని, షుగర్ స్థాయిలను పరీక్షించుకోవడం ఉత్తమం.

Leave a Comment